నెమరు వేయుట || Chewing the cud || Rumination

నెమరు వేయుట



దేవుడైన యెహోవా తనకు దహన బలిగా అర్పించబడే జంతువులు ఏవో చెబుతూనే.. వాటికి కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకున్నాడు.

లేవీయకాండము 1:2 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము – మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు, గోవుల మందలో నుండిగాని గొఱ్ఱెల మందలో నుండిగాని మేకల మందలో నుండిగాని దానిని తీసికొని రావలెను.

లేవీయకాండము 11:3-4 [3] జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చునుగాని [4] నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు...

పవిత్రమైన జంతువులుగా ఉన్న వాటికి ఉన్న రెండు లక్షణాలలో నెమరువేసే లక్షణం ఒకటి. పవిత్రమైన మరియు దేవుడు కోరుకున్న గోవు, మేక, గొఱ్ఱె లలో వున్న నెమరు వేసే స్వభావం గురించిన విషయాలు తెలుసుకుందాం.  రెండు డెక్కలు గల స్వభావం గురించి మరొక వ్యాసంలో వ్రాయబడి వుంటుంది గమనించండి.

  నెమరు వేసుకోవడం అంటే - జంతువులు మేత దొరికినప్పుడు తిని, తరువాత తీరికగా వున్నప్పుడు ఆ ఆహారాన్ని తిరిగి నోట్లోకి తెచ్చుకొని నిదానంగా పూర్తిగా నమిలి మింగుతాయి. అలా చేయడం వలన అందులోని పోషకాలను అవి పూర్తిగా గ్రహించగలవు.

ఈ ప్రక్రియ నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు - గ్రహించవలసిన ఆత్మీయ సంగతులు:

  1. నెమరు వేయడం అవసరం: పశువులు మేత మేయడానికి వెళ్ళి, మేత మేసి తిరిగి ఇంటికి వచ్చి తీరికగా వున్న సమయాలలో ఆ గడ్డిని తిరిగి నోట్లోకి తెచ్చుకొని నెమరువేసుకుంటూ వుంటాయి కదా! అలాగే మన ఆత్మకు ఆహారం అయిన వాక్యం కోసం చర్చ్ కి, కూటములకు, పరిచర్య లకు వెళ్ళి తిరిగి వచ్చిన తరువాత మనం ఏదైతే విన్నామో దానిని తప్పని సరిగా మళ్ళీ ఒకసారి ధ్యానించాలి. అలా పశువులు నెమరు వేసుకున్నప్పుడే వాటికి అందులో ఉన్న పోషకాలు పూర్తిగా అందినట్లు, మనం విన్న వాక్యాన్ని మళ్ళీ ధ్యానించినప్పుడే ఆ సంగతులు పూర్తిగా మనకు అర్థం అవుతాయి.  ఒకవేళ ఈ జంతువులు నెమరు వేసుకోకపోయినా ఏమవుతుందిలే, అని అనుకుంటాయా? లేదు కదా, ఎంత ఆలస్యం అయినా సరే, పడుకొని అయినా నెమరు వేస్తూ వుంటాయి, అప్పుడు వాటికి పూర్తిగా అందులోని శక్తి లభిస్తుంది. రోజంతా విన్నాము కదా, మళ్లీ ధ్యానించకపోతే ఏమవుతుందిలే అనుకుంటే? ఏమీ కాదు కానీ, ఆ విన్న వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము, పాక్షికంగా మాత్రమే అర్థం చేసుకోగలము.
  2. ఎక్కువగా నెమరు వేయుట: ఆవు తిన్న గడ్డి మొదటగా ఆవు పొట్ట లో వున్న నెమరు వేసే భాగానికి (రుమెన్) లోకి వెళ్ళి అక్కడ వుంటుంది, అందులో దాదాపు 90 లీటర్ లు సైజ్ ఆహారం పడుతుంది. అంటే చాలా ఎక్కువ సైజ్ కదా, మనం రోజంతా వాక్యం విన్నా కూడా, అది ఆవు లాగా నెమరు వేసే భాగంలో నిల్వ చేసుకోగలగాలి. మనం ఒక గంట, రెండు గంటలు వాక్యం విని, పెద్ద భారం మోసుకున్నట్లు ఫీల్ అవుతూ వుంటాము కదా. చాలామంది క్రైస్తవులు ఆరాధన అయిపోగానే, ఇక చాల్లే ఈ రోజుకు అని లేచి వెళ్ళిపోతూ వుంటారు, వాక్యం వినరు. అలాంటి వారు ఆవు నుంచి గ్రహించుకోవలసింది చాలా ఉంది. ఆవులు రోజులో 35-40 % సమయాన్ని నెమరు వేసుకోవడానికి తీసుకుంటాయి. రోజులో మూడో భాగం అవి నెమరు వేసుకోవడానికి తీసుకుంటాయి. రెండు గంటలు వాక్యం వింటే ఒక గంట అయినా మన ఖాళీ సమయంలో దానిని ధ్యానించడానికి మనం కేటాయించాలి.
  3. నెమరు ద్వారానే ప్రయోజనం: తిన్న ఆహారం నెమరు వేయడం ద్వారా సుమారుగా 75 % అందులోని శక్తిని ఆవులు గ్రహించుకోగలవు. సింపుల్ గా మీకు అర్థం కావాలంటే... ఆవు ఒక నాలుగు అరటిపళ్ళు తింటే, అందులో ఒకదానిని మాత్రమే అది డైరెక్ట్ గా జీర్ణించుకోగలదు, మిగతా మూడు అరటిపళ్ళను జీర్ణించుకోవాలంటే ఖచ్చితంగా నెమరు వేసుకోవాలి. అంటే నేరుగా తింటే కొంత భాగం మాత్రమే ఆవులు జీర్ణం చేసుకోగలవు. దానిని నెమరు వేసుకుంటేనే పూర్తి స్థాయిలో జీర్ణం చేసుకోగలవు. అంటే - మనం వాక్యం డైరెక్ట్ గా వింటే ఆ మొత్తం వాక్యాన్ని పూర్తిగా గ్రహించుకోలేక పోవచ్చు, కానీ విన్న దానిని కచ్చితంగా తిరిగి ధ్యానించినప్పుడు మాత్రమే దానిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలము.  మీరు విన్న దానిని తిరిగి ధ్యానించకపోతే వాస్తవంగా మీరు విన్నదానిలో 25% మాత్రమే అర్థం చేసుకున్నారని, మిగిలిన 75% అర్థం చేసుకోలేకపోయారని అర్థం. ఫలితంగా మీరు ఎంత విన్నా కూడా అందులోని సారాంశం గ్రహించుకోలేరు.  అయ్యా! మేము రోజంతా వాక్యం విన్నాము, కానీ మాకు అర్థం కావడం లేదు, కొంచెమే అర్థం అయింది అంటే, కారణం ఇదే.
  4. వ్యర్థంగా పోయేది లేదు: దేవుడు కోరుకున్న జంతువులు అయిన గోవు, గొఱ్ఱె, మేక ల నుంచి వ్యర్థంగా పోయేది అంటూ ఏమీ ఉండదు. మిగతా ఏ జంతువు పెంటను అయినా అసహ్యించుకుంటారు కదా! కానీ గోవు పేడ - ఇంటి ముందర, పాతకాలంలో ఇళ్లలో కూడా అలికే వారు, అవి పొలాలకు కూడా తిరుగులేని ఎరువులు.  మేక, గొఱ్ఱె పెంటికలు చాలామంచి ఎరువులు. వాటిని రైతులు డబ్బులు ఇచ్చి మరీ కొంటారు. అంటే - అలా నెమరు వేసుకొని తిన్న దానిని పూర్తిగా జీర్ణం చేసుకున్న వాటినుంచి ఏదీ కూడా వ్యర్థంగా పోదు.   మనం విన్న దానిని ధ్యానించే వారంగా ఉంటే మన నుంచి వచ్చే ఏ మాట కూడా వ్యర్థంగా వుండదు.  వాక్యం ధ్యానించకుండా ఊరికే మాట్లాడేవారు మిగతా జంతువులతో సమానం. మిగతా జంతువుల పెంట ఎంత అసహ్యం మరియు ఎంత చెడ్డ వాసన వస్తుందో గమనించే వుంటారు. కానీ వాక్యం విని ధ్యానించి మాట్లాడేవారు ఒక్క మాట కూడా వ్యర్థంగా పలకరు. మన నుంచి ఏ మాట కూడా వ్యర్థం అవ్వదు. వాక్యాన్ని ధ్యానించే వారి క్రియ ఏదైనా సరే వ్యర్థం అవ్వదు, అది ఖచ్చితంగా ఏదొక విధంగా శ్రేష్టమైన విధంగానే ఉపయోగపడుతుంది.
  5. నెమరు వేయగలవారే కావాలి: ఆవు దూడ లలో నెమరు వేసే రుమెన్ అనే అవయవం పని చేయదు. ఎందుకంటే అవి పాలు తాగే స్థితిలో ఉంటాయి, మేత మేయవు కాబట్టి, వాటికి నెమరు వేసుకోవలసిన అవసరం ఉండదు. అంటే - పాలుత్రాగే స్థితి అంటే కొత్తగా రక్షింపబడిన వారు. వీరు వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకునే స్వభావం, లక్షణాలు కలిగి వుండరు కాబట్టి, వారికి పాలవంటి సులభంగా జీర్ణం అయ్యే ఆహారం అందేలా బోధకులు చూసుకోవాలి.

అందుకే మీకా ప్రవక్త ఈ విధంగా అంటాడు - 

మీకా 6:6 - ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? "ఏడాది దూడలను" అని అంటూ వున్నాడు. అంటే అప్పటికి పాలు త్రాగే వయస్సు నుంచి పూర్తిగా మేత మేసి నెమరు వేసే స్వభావానికి చేరుకుంటాయి. కాబట్టి బలిగా అర్పించబడాలంటే పాలుతాగే స్థితి లోని వారిని దేవుడు కోరుకోలేదు, ఏడాది దూడలు - అంటే బలమైనవి, నెమరు వేసి శక్తిని పూర్తిగా గ్రహించుకోగలిగిన వాటిని బలిగా ఇష్టపడతాడు.

యేసు క్రీస్తు ప్రభువు శిష్యులలో కూడా ఈ నెమరు వేసుకునే స్వభావాన్ని చూడవచ్చు.  కొన్ని ఉదాహరణలు చూస్తే - 

మత్తయి 24:3 - ఆయన ఒలీవల కొండమీద కూర్చుండి యున్నప్పుడు శిష్యులాయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా...

యేసు క్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 23 వ అధ్యాయం లో సమాజ మందిరము లో సుదీర్ఘ ప్రసంగం చేసి అక్కడినుంచి వెళ్ళేటప్పుడు ఆయన శిష్యులు దేవాలయం గొప్పతనం గురించి చెబితే, – "మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని" అని వారితో చెబుతాడు. శిష్యులు ఈ విషయాలు విని మళ్ళీ ఏకాంతంలో వున్నప్పుడు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? దానికి సూచనలు ఏమిటి? నీ రాకడకు సూచనలు ఏమిటి? ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? అని అడుగుతారు.

ఇదే నెమరు వేసుకునే స్వభావం అంటే.  ఇంకా ఇలాంటి సందర్భాలే మరికొన్ని బైబిల్ లో చూడవచ్చు...

మత్తయి 20:17 - యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను.

మత్తయి 17:19 - తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి–మేమెందుచేత దానిని వెళ్లగొట్టలేక పోతి మని అడిగిరి.

కాబట్టి నెమరు వేసుకునే స్వభావం, నెమరు వేసుకునే లక్షణం విశ్వాసులకు, విశ్వాసంలో వృద్ధి చెందాల్సిన వారికి చాలా అవసరం. మీకు విన్న వాక్యం అర్థం కాలేదంటే మీరు నెమరు వేయలేదని అర్థం. అలా నెమరు వేసుకుంటేనే అందులోని పూర్తి శక్తిని గ్రహించి ఆత్మలో బలవంతులుగా మారగలరు.


@ @ @

Comments

Popular posts from this blog

రెండు డెక్కలు || Cloven Hooves || Split Hooves

తూరు - పొరుగున వున్న పట్టణం