తూరు - పొరుగున వున్న పట్టణం
తూరు పట్టణం:
బైబిల్ దృష్టిలో ఒక విమర్శనాత్మక విశ్లేషణ
పాతనిబంధనలో వున్న ప్రతి చారిత్రక పట్టణం చరిత్ర, నాశనానికి గల కారణాలు గురించి పరిశుద్ధ గ్రంధం నుంచే మనం చాలా సంగతులు తెలుసుకోవచ్చు. యెరూషలేము పట్టణానికి ఆనుకొని ఉన్న తూరు పట్టణం గురించి మనం పరిశీలిద్దాం.
::చరిత్ర::
తూరు మరియు యెరూషలేము పట్టణాలు పక్కపక్కనే ఉంటాయి.
పాత నిబంధనలో రాయబడిన తూరు పట్టణం ఒక ద్వీపం - అంటే చుట్టూ సముద్రపు నీరు వుంటుంది, మళ్లీ దాని చుట్టూ బలమైన ప్రాకారం కట్టబడి ఉండేది.
జెకర్యా గ్రంథం ద్వారా తూరు పట్టణం గురించి మనకు నాలుగు విషయాలు తెలుస్తాయి:
జెకర్యా 9:2-3 - [2] ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలీయుల గోత్రపువారినందరిని లక్ష్యపెట్టువాడు గనుక, దాని సరిహద్దును అనుకొని యున్న హమాతును గూర్చియు, జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులనుగూర్చియు అది వచ్చెను. [3] తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని, యిసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి.
ఈ వచనం నుంచి తూరు పట్టణం సంపద, ఙ్ఞానం, రక్షణకు ఏమాత్రం కొదువ లేనిదిగా ఉందని తెలుస్తూ ఉంది. ఆ వివరాలను మరింత వివరంగా చూస్తే -
1. అన్యజనులు: ఇశ్రాయేలీయుల గోత్రపువారి సరిహద్దును అనుకొని వున్న అన్య జనాంగం, అంటే దేవుని ఎరుగని ప్రజలు వీరు. కనాను భూభాగం చుట్టూ అన్య జనులే నివాసం వుంటారు. అక్కడే కాదు, మిగతా దేశాలు, రాజ్యాలు అన్ని కూడా అన్య జనులే వుంటారు. ఎందుకంటే, దేవుడు అబ్రహాము కు, అతని సంతానానికి కనాను ప్రాంతాన్ని స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పి అక్కడికి నడిపిస్తాడు, అక్కడే నివసిస్తూ వుంటారు కూడా. కానీ అయితే కరువు వచ్చినప్పుడు, యోసేపు కాలంలో వీరందరూ ఐగుప్తుకు వెళతారు. [ఆదికాండము 46:2-4, 6-7]
ఆ ప్రదేశం అంతా అబ్రహాము సంతానానిదే. కానీ వారు లేనప్పుడు ఇతర జనాంగాలు ఆ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నారు. మళ్లీ ఆ కనాను ప్రదేశానికి రావడం లో జరిగే విషయాలే మోషే కాలంలో వుంటాయి. మోషే నాయకుడిగా అబ్రహాము సంతానమైన లక్షలాది ప్రజలను ఐగుప్తు నుంచి తిరిగి కనాను కు తీసుకొని వెళతారు. కనాను చుట్టూ తూరు, ఫిలిష్తీయులు, ఎదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు మొదలగు అన్య జనాంగం నివసిస్తూ వుంటారు.
2. జ్ఞానం: [జెకర్యా 9:2] ఈ లోకం లో ధనవంతులు అయినవారిని చూడండి. వారు ఎలా ధనవంతులు అయివుంటారు. వారి తెలివి, వ్యాపారం వలనే కదా. తూరు ఒక చిన్న పట్టణం అయినప్పటికీ చుట్టుపక్కల పట్టణాల కంటే అత్యధికంగా వ్యాపారంలో వృద్ధి చెందింది వారికి చాలా తెలివి, ఙ్ఞానం ఉంటేనే కదా పోటీ పడి అలాంటి పేరు సంపాదించుకున్నారు. తూరు పట్టణం ఎలాంటి వ్యాపారాలు చేసేదో, ఏ ఏ దేశాలతో చేసేవారో యెహెజ్కేలు గ్రంథం 27 వ అధ్యాయం లో వివరంగా వ్రాయబడి వుంటుంది. తూరు పట్టణం దాదాపుగా 38 పట్టణాలతో వ్యాపారం చేస్తున్నట్లుగా అక్కడ చూడవచ్చు. వారితో ఎలాంటి వ్యాపారాలు చేసేదో AI images ద్వారా చూడవచ్చు.
[5] నీ ఓడలను శెనీరుదేశపు సరళవృక్షపు మ్రానుతో కట్టుదురు, లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడకొయ్యలు చేయుదురు. [6] బాషానుయొక్క సింధూరమ్రానుచేత నీ కోలలుచేయుదురు...
[7] నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తునుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసె నారబట్టతో చేయబడును;...
[8] తూరుపట్ట ణమా, సీదోను నివాసులును అర్వదు నివాసులును నీకు ఓడకళాసులుగా ఉన్నారు... [9] గెబలు పనివారిలో పనితెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయు వారుగా నున్నారు...
[10] పారసీకదేశపువారును లూదు వారును పూతువారును నీ సైన్యములలోచేరి నీకు సిపాయిలుగా ఉన్నారు, వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు, వారిచేత నీకు తేజస్సు కలిగెను. [11] అర్వదువారు నీ సైన్యములోచేరి చుట్టు నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి ...
[12] ... తర్షీషు వారు నీతో వర్తకముచేయుచు, వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. [13] గ్రేకేయులును తుబాలువారును మెషెకువారును నీలో వర్తకవ్యాపారముచేయుచు, నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు,
[14] తోగర్మావారు గుఱ్ఱములను యుద్ధాశ్వములను కంచరగాడిదలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు; [15] దదానువారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు.
[16] ... సిరియనులు నీతో వర్తకవ్యాపారము చేయుదురు, వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసెనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.
[17] మరియు యూదావారును ఇశ్రాయేలు దేశస్థులును నీలో వర్తక వ్యాపారముచేయుచు, మిన్నీతు గోధుమలును మిఠాయిలును తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.
ఇలాగా 25 వ వచనం వరకూ తూరు పట్టణం చేసే వ్యాపారాల గురించి వ్రాయబడి వుంటుంది.
3. రక్షణ: తూరు పట్టణం సైన్యం పరంగా ఎంత బలంగా ఉండేదో కింది వచనం చూస్తే తెలుస్తుంది. [యెహెజ్కేలు 29:18]
దీని గురించిన చరిత్ర తెలియాలంటే ఇంటర్నెట్ లో Siege of Tyre (332 BC) అని వెతికినా మీకు సమాచారం లభిస్తుంది. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి వినివుంటారు. అతను చాలా రాజ్యాలు జయించినప్పటికీ ఈ తూరు పట్టణమును జయించాలంటే దాదాపుగా 7 నెలలు పట్టింది. తూరు పట్టణం చాలా చిన్నది. అయినప్పటికీ దానికి వున్న రక్షణ, సైన్యం, చుట్టూ వున్న సముద్రం, ప్రాకారం వాళ్ళని చాలాకాలం కాపాడాయి, కానీ దానిని జయించడానికి అలెగ్జాండర్ తన సైనికుల చేత సముద్రంలో దాదాపుగా 200 మీటర్ల వెడల్పు ఉన్న వంతెనలాంటి నిర్మాణం చేయిస్తాడు. సైనికులు రాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్లు తీసుకొని వచ్చి అక్కడ వంతెన లాంటి నిర్మాణం నిర్మించి చివరికి ఆ పట్టణాన్ని జయిస్తారు. యెహెజ్కేలు 29:18 లో దీని గురించే వ్రాయబడి వుంటుంది.
4. సంపద: [జెకర్యా 9:3] ప్రతి ఒక్కరూ తమ చిన్నతనం లో ఏదొక సందర్భంలో - దేవుడు కనిపించి ఏమి కావాలో కోరుకో అని అడిగితే, ఏమని కోరుకోవాలని అనుకునే వారము? 'దేవుడా! ఒక ఇంటి నిండా డబ్బు, బంగారం వుండాలి' అని అడగాలని ఒక్కసారైనా అనుకొని వుంటారు కదా! కానీ తూరు పట్టణస్తులకు ఆ అవసరం లేదు, ఎందుకంటే అంతకు మించి వారికి బంగారం, వెండి సమృద్ధి గా వున్నాయి.
5. స్నేహం: యెరూషలేము లో దావీదు రాజుగా పరిపాలించే సమయంలో తూరు రాజు అయిన హీరాము దావీదు తో స్నేహంగా ఉండేవాడు.
[2 సమూయేలు 5:11] దావీదు రాజు యెరూషలేము లో రాజ్యం స్థిరపడిన తరువాత ఒక రాజనగరు కట్టించుకోవాలని అనుకున్నప్పుడు తూరు రాజైన హీరాము దావీదుకు మంచి స్నేహితుడు కాబట్టి సంపద కి ఏ మాత్రం కొదువ లేదు కాబట్టి, దేవదారు మ్రానులను, పనివారిని పంపించి మంచి రాజనగరు కట్టించాడు.
దావీదు తదనంతరం ... అతని కుమారుడైన సొలొమోనుతో కూడా తూరు రాజు అయిన హీరాము స్నేహం కొనసాగిస్తాడు. [1 రాజులు 5:1-7]. సొలొమోను దేవునికి మందిరం కట్టించడానికి కావలసిన సామాగ్రి, దేవదారు మ్రానులు చాలామంది పనివారిని హీరాము పంపిస్తాడు. వీటిని బట్టి చూస్తే సొలొమోను రాజు పరిపాలనలో కూడా తూరు పట్టణం యెరూషలేముతో మంచి సంబంధమే కలిగి ఉంది.
6. తూరు నిజస్వరూపం - దేవుని కోపం:
యెహెజ్కేలు 27:1-3, 36 - [1] మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. [2] –నరపుత్రుడా, తూరు పట్టణముగూర్చి అంగలార్పు వచనమెత్తి దానికీలాగు ప్రకటన చేయుము [3] –సముద్రపురేవులమీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణముచేయు వర్తకజనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – తూరు పట్టణమా–నేను సంపూర్ణ సౌందర్యము కలదాననని నీవను కొనుచున్నావే; [36] జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు.
దావీదు రాజు తరువాత సొలొమోను, ఆ తరువాత యెరూషలేమును పరిపాలించడానికి వచ్చే రాజులలో చాలామంది దేవుడంటే భయం లేనివారే ఎక్కువమంది పరిపాలించారు. ప్రజలు కూడా దేవుని భయం లేకుండా పోవడంతో దేవుడు వారిని సరిచేయడానికి శిక్షకు గురి చేస్తాడు. [2 రాజులు 25:8-10]
2 రాజులు 25: [9] యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న యిండ్లన్నిటిని గొప్పవారి యిండ్లన్నిటిని అగ్నిచేత కాల్పించెను. [10] మరియు రాజదేహసంరక్షకుల అధిపతియొద్దనున్న కల్దీయుల సైనికులందరును యెరూషలేము చుట్టునున్న ప్రాకారములను పడగొట్టిరి.
యెరూషలేము కు కష్టాలు వచ్చినప్పుడు, దేవుని ప్రజలు పాపం చేసి ఆయనకు దూరంగా వెళ్ళినపుడు, దేవుని మాటకు లోబడకుండా, దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు, దేవుడు తన ప్రజలను వారిని శ్రమలకు అప్పగించినప్పుడు, యెరూషలేము మీదికి బబులోను రాజు, ఇతర రాజ్యాలు దండెత్తి యెరూషలేము పట్టణ ప్రాకారాలు పడగొట్టి, గుమ్మాలు, దేవాలయాన్ని, ఆ పట్టణాన్ని మొత్తం అగ్ని చేత కాల్చి వేస్తారు. ఆ సమయంలో యెరూషలేములో నివసించే ఇశ్రాయేలీయులు పారిపోతారు, వారి పారిపోతున్న వారిని కూడా తూరు పట్టణస్థులు పట్టుకొని శత్రువులకు అప్పగిస్తారు. [కీర్తనలు 83:4, 6-7]
యెరూషలేము పట్టణాన్ని పూర్తిగా లేకుండా చేయాలి, అంతం చేయాలి అని తూరు పట్టణం వారు పథకం పన్నారు. వారు ఇంతవరకూ యెరూషలేము తో చేసిన స్నేహం, సహోదర నిబంధన (1 రాజుల గ్రంథం 5:12) మరిచిపోయి ఇశ్రాయేలీయులు, యూదా వారు కష్టాలలో వున్న సమయంలో వారిని పూర్తిగా అణగదొక్కాలని చూస్తూ ఉన్నారు.[ఆమోసు 1:9]
యెహెజ్కేలు 26:2 –నరపుత్రుడా, యెరూషలేమునుగూర్చి–ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నావశమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక ...
యెరూషలేము పట్టణం పాడైపోతే... తూరు పట్టణం సంతోషిస్తూ ఉంది. ఎందుకంటే... ఉత్తర, తూర్పు దేశాలకూ, ఆఫ్రికా ఖండానికి, ఈజిప్ట్‌కూ మధ్య వ్యాపారాలకు, రాకపోకలకు యెరూషలేము పట్టణం కేంద్రంగా వుంటుంది.
ఎక్కువ వ్యాపారాలు, ఆ పట్టణం ద్వారా జరుగుతూ వుండవచ్చు. యెరూషలేము పట్టణం నాశనం కావడం వలన తూరు పట్టణం - యెరూషలేము పట్టణం లో జరిగే వ్యాపారం అంతా ఇప్పుడు నాకు వస్తుంది అని సంతోషిస్తూ యెరూషలేము పట్టణం నాశనం కావాలని కోరుకుంటూ ఉంది.
బాగా వ్యాపారం జరుగుతూ ఎప్పుడూ కోలాహలంగా వుండే షాప్ మూతపడితే, దాని పక్కన వున్న షాప్ కి గిరాకీ పెరుగుతుంది కదా! లోకం యొక్క ప్రవర్తనను మనం ఈ పట్టణం నుంచి తెలుసుకోవచ్చు.
:: తూరు పట్టణం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ::
1. పొరుగున ఉన్న అన్యజనాంగం: తూరు పట్టణం - ఇశ్రాయేలుకు సరిహద్దులో ఉండే దేవుని ఎరుగని పట్టణం. మన చుట్టూ ఉండే ప్రజలు కూడా చాలామంది దేవుని ఎరుగనివారే. మీ ఇంటి చుట్టుపక్కల ఎవరు ఉన్నారు ఒకసారి గమనించండి. విశ్వాసులుగా జీవించే మనం యెరూషలేము లో జీవించే ప్రజలకు సాదృశ్యం గా వున్నాము. దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులను వాగ్దానం ద్వారా ఏర్పరచుకొని రక్షిస్తూ వచ్చినట్లే ఈనాడు మనలను కృప ద్వారా ఏర్పరచుకొని రక్షిస్తూ వున్నాడు.
2. ధన, బల, ఘనతలు కలిగిన వారు: తూరు పట్టణం ఎలాంటి రక్షణ వ్యవస్థ కలిగివుందో, ఎలాంటి సంపద కలిగి ఉందో, ఎలాంటి వ్యాపారాలు, పేరు ప్రఖ్యాతలు కలిగివుందో చూసాం కదా. లోకంలో వున్న వారు మనకంటే గొప్పవారు, బలవంతులు, తూరు పట్టణానికి వున్నట్లుగా ధనం, బంగారం, తెలివి, జ్ఞానం, రక్షణ, అధికారం అన్నీ ఎక్కువే ఉంటాయి.
3. బలహీనులను అణగద్రొక్కుట: దావీదు రాజు దేవునికి ఎంతో నమ్మకంగా దేవునికి ఇష్టంగా జీవించాడు. సొలొమోను రాజు కూడా. సొలొమోను రాజు అంటాడు కదా - నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసియున్నాడు. [1 రాజులు 5:4]. యెరూషలేము దేవుని హత్తుకొని, ఆయనను ఆశ్రయించి వున్నంతవరకూ దేవుని భయం యెరూషలేము చుట్టూ వున్న దేశాలకు ఉండేది, కాబట్టే వారు యెరూషలేము వైపు కన్నెత్తి కూడా చూడటానికి భయపడ్డారు. అలాంటి సమయంలో, యెరూషలేము కొదువ లేకుండా, చింత లేకుండా నెమ్మది కలిగి వున్నప్పుడు తూరు రాజు యెరూషలేము తో మంచిగా స్నేహం చేసి, యెరూషలేము శిక్షా కాలంలో మాత్రం దానిని పూర్తిగా అంతం చేయాలని తూరు పట్టణం ప్రయత్నించింది.
మనం దేవుణ్ణి హత్తుకొని, ఆయనకు ఇష్టంగా, నమ్మకంగా వున్నప్పుడు, దేవుని భయం మన చుట్టూ వున్న ప్రజల మీద ఖచ్చితంగా వుంటుంది. మనం దేవుని కాపుదలలో లేనప్పుడు శత్రువు చేతిలో మనం చిత్తుకాకతప్పదు.
4. అన్యులతో స్నేహం - ఆరాధనకు ఆటంకం: [నెహెమ్యా 13:16 - తూరు దేశస్థులును కాపురముండి, యెరూషలేము లోను విశ్రాంతిదినములో యూదులకు చేపలు మొదలైన నానా విధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి.] తూరు పట్టనస్థులు అన్యులు కాబట్టి విశ్రాంతి దినం రోజున వారు యెరూషలేము లో వ్యాపారాలు చేసేవారు. విశ్రాంతి దినాన్ని పాటించేవారు కాదు. చేపల, ఇంకా ఏదొక వ్యాపారం చేస్తూ ఉండేవారు. తూరు పట్టనస్తులు అన్య జనులు కాబట్టి వారికి దేవుని భయం, ఆజ్ఞలు ఏమీ తెలియదు. ధర్మశాస్త్రం లోని 10 ఆజ్ఞలలో నాలుగవ ఆజ్ఞ - విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. కానీ తూరు పట్టనస్థులకు ఇవి తెలీదు కాబటి వారు ఆదివారం యెరూషలేము లో వ్యాపారాలు చేసుకుంటూ వున్నారు. ఒకవేళ మనం అలాంటి వారితో స్నేహం చేస్తే వారితో భాగస్థులం అయితే, ఆదివారం ఆరాధన పోగొట్టుకొని వ్యాపారాలు చేసుకుంటూ వుంటాం. (పాతనిబంధన కాలంలో విశ్రాంతి దినం ను పరిశుద్ధంగా ఆచరించేవారు. నేడు మనం ఆదివారం ను పరిశుద్ధ దినంగా ఆచరిస్తున్నాం).
5. కార్యం జరగాలి - రక్షణ వద్దు: [మార్కు 3:8 - మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమయనుండియు, యొర్దాను అవతలనుండియు, తూరు సీదోను అనెడి పట్టణప్రాంతములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి.] తూరు నుంచి ఇతర పట్టణాల నుంచి గుంపులు గుంపులు గా యేసు క్రీస్తు ప్రభువు చేసే అద్భుతాలు, గొప్ప కార్యాలు చూడటానికి జనం వచ్చారని వుంది.
అక్కడ ఏదో జరిగిపోతూ ఉంది, ఏదో అద్భుతం జరుగుతూ వుంది అని జనం తండోపతండాలుగా బయట ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. వాక్యం వినడానికి కాదు, అద్భుతాలు, గొప్ప కార్యాలు చూడటానికి మాత్రమే. క్రైస్తవులుగా జీవించే మనం అలాంటి వాటికోసం స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు నమ్ముతూ, అవి చేసే వారి వద్దకు అందరూ వెళ్ళినట్లే వెళుతూ ఉంటే మనం క్రైస్తవులము కాదు, తూరు పట్టణస్తులము అని లెక్క. వాక్యం కోసం తప్ప మరి దేనికోసమూ ఆరాటపడకూడదు.
6. బలమైన విశ్వాసం గల అన్యులు: [మత్తయి 15:21-28 - దయ్యము పట్టిన కుమార్తె గల తూరు సీదోను ప్రాంతాలకు చెందిన స్త్రీ] యేసు క్రీస్తు ప్రభువు సువార్త ప్రకటిస్తూ రోగులను స్వస్థపరుస్తూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ వున్నప్పుడు తూరు సీదోను పట్టణ ప్రాంతాలలో నివసించే ఒక స్త్రీ వచ్చి తన కుమార్తెను స్వస్థపరచమని వేడుకుంటూ ఉంది. ఆయన ఆమె విశ్వాసం పరీక్షించడం కోసం చాలా సమయం పాటూ ఆమెను పట్టించుకోలేదు.
ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు అన్యులైన వారిని నిర్లక్ష్యం చేయలేదు కానీ, వారి విశ్వాసం ఎలావుంటుందో మనకు తెలియచేయడం కోసం ఆమెకు ఈ పరీక్ష పెట్టివుండవచ్చు. ఒకవేళ ఆయనకు అన్యులను స్వస్తపరిచే ఆలోచన లేకుంటే అసలు ఆ ప్రాంతాలకు వెళ్లి సువార్త ప్రకటించడు కదా! కొన్ని సమయాలలో విశ్వాసులకంటే అన్యులే దేవుని మీద ఎక్కువ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి వుంటారు. ఆ విషయం ఈ సందర్భంలో రుజువు అవుతూవుంది.
7. బలహీన మనస్తత్వం గల విశ్వాసులు: [మత్తయి 15: [29] యేసు అక్కడనుండి వెళ్లి, గలిలయ సముద్రతీరమునకు వచ్చి, కొండ యెక్కి అక్కడ కూర్చుండగా [30] బహుజనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను.] తూరు పట్టనస్థురాలైన స్త్రీ వస్తే ఆమెను పట్టించుకోలేదు యేసు క్రీస్తు, ఆమెను శిష్యులు కూడా వెళ్ళిపొమ్మని చెప్పారు, యేసు క్రీస్తు ప్రభువు కూడా ఆమెను చాలా రకాలుగా ప్రశ్నలతో, మాటలతో పరిశీలించాడు, ఆమె విశ్వాసం గొప్పది కాబట్టే, బలమైనది కాబట్టే ఆమెకు కావలసింది పొందుకొని వెళ్ళింది. కానీ యేసు క్రీస్తు ప్రభువు అక్కడనుంచి వచ్చి గలిలయ సముద్రతీరమునకు వెళ్ళినప్పుడు అనేకమంది వచ్చారు, వారందరిని బాగుపరచి పంపించాడు. వారిని ఎవరినీ కూడా ప్రశ్నలు అడగలేదు. ఎందుకంటే వారు ఇశ్రాయేలీయులు కాబట్టి, బలహీన మనస్తత్వం కలిగిన వారు కాబట్టి. మోషే నాయకత్వంలో వారు ఎడారి గుండా ప్రయాణం చేసే సమయాలలో వారు నీటికోసం, ఆహారం కోసం ప్రతి దానికి కొంచం కూడా ఓపికను ప్రదర్శించలేక పోయారు. మరి ఒకవేళ తూరు పట్టనస్థురాలైన స్త్రీ ని ప్రశ్నించిన విధంగా వారిని ప్రశ్నించి ఉంటే? ఎవరూ మిగిలివుండేవారు కాదు కదా! కాబట్టి విశ్వాసులు కూడా తాము ప్రార్థన చేసిందే తడవుగా దేవునియొద్ద నుంచి సమాధానం రావాలని ఆశిస్తూ వుంటారు. ఈ విషయంలో అన్యులైన వారే కొంత మెరుగ్గా కనిపిస్తూ వుంటారు. వారు తమ కోరికలు నెరవేరడం కోసం తమ దేవుళ్ళకు దేవతలకు భక్తితో పూజలు చేస్తూ మొక్కుబడులు, తీర్థయాత్రలు అని పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తూనే వుంటారు.
8. మారుమనస్సు పొందవలసిన సమయం: [లూకా 10:[13] అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని కూర్చుండి మారుమనస్సు పొందియుందురు. [14] అయినను విమర్శకాలమునందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వదగినదై యుండును.] మీరు మారుమనస్సు పొందకుండా వుంటే మాత్రం ఉగ్రత దినాన అన్యులైన కొంతమంది స్థితి కొంతమంది విశ్వాసుల పరిస్థితి కంటే మెరుగ్గా వుంటుంది అని దేవుడు చెబుతున్నాడు. అనేకమంది కుంటివారు, గుడ్డివారు, దయ్యము పట్టినవారు, రోగగ్రస్తులు వచ్చినప్పుడు వారి విశ్వాసాన్ని ఏ మాత్రం ప్రశ్నించకుండా స్వస్థపరిచిన కూడా వారు ఇంకా ఆయన యందు విశ్వాసముంచడానికి వెనుక తీస్తున్నారు.
మరి మనం ఇంత కాలం దేవుని సువార్త విని, ఆయన వాక్యం విని, ఆయన మనకు మధ్య చేసిన అద్భుత కార్యాలు చూసి, ఆయన ద్వారా మేలులు పొంది, అంతవరకే పరిమితం అయ్యి, మారుమనస్సు పొందకుండా జీవిస్తూ ఉంటేమాత్రం మన మీదకు వచ్చే ఉగ్రతను మనం ఏమాత్రం తట్టుకోలేము.
:: ముగింపు ::
మనం ఇంతవరకూ తెలుసుకున్న తూరు చరిత్ర నుంచి మనం గ్రహించవలసిన విషయాలు:
మన చుట్టూ నివసించే అన్య జనులు దేవునితో మన సంబంధం దావీదు దేవునితో కలిగివున్నట్లు బలంగా ఉన్నప్పుడు వారు మనతో స్నేహం చేస్తారేమో కానీ, మనం దేవుని నుంచి వేరై బలహీన స్థితిలో వున్నప్పుడు వారు మన నాశనాన్ని కోరుకుంటారు. మనల్ని మరింత అనగద్రొక్కి లేకుండా చేయాలని చూస్తారు. కానీ అలాంటి వారిలో కూడా కొంతమంది తూరు స్త్రీ లాంటి బలమైన విశ్వాసం కలిగినవారు వుంటారు. అలాంటి వారి కోసమే యేసు క్రీస్తు ప్రభువు సైతం ఆ ప్రాంతాలకు తిరిగి సువార్త ప్రకటించాడు.
కావున, మన చుట్టూ వున్న అన్యులలో మన కీడు కోరే వారు వున్నప్పటికీ, మంచివారు కూడా ఉంటారు, వారందరూ రక్షింపబడటం కోసం యేసు క్రీస్తు ప్రభువు మాదిరిగా మనం కూడా వారికి సువార్తను ప్రకటించవలసిన వారముగా వున్నాము.
ఒకవేళ తూరు పట్టణం యెరూషలేము నాశనం కావడం చూసి సంతోషించినప్పటికీ దాని మీదికి వచ్చిన ఉగ్రత నుంచి అది తప్పించుకోలేక పోయింది. ప్రస్తుతం ఆనాడు ఉన్న తూరు పట్టణం సముద్రంలో కలిసిపోయిన ఆనవాళ్లు తప్ప ఇంక ఏమీ మిగిలిలేవు. కానీ యెరూషలేము మాత్రం ప్రపంచంలో రక్షణ, టెక్నాలజీ దేనిపరంగానయినా సరే ఉన్నతమైన దేశాలతో సమానంగా నిలిచిఉంది.
అలాగే విశ్వాసులను అనగద్రొక్కాలని ప్రయత్నం చేసే వారు కూడా ఆనవాళ్లు లేకుండా నశిస్తారేమో కానీ, ఆయనయందు విశ్వాసముంచువారు నిత్యమూ ఆయనతో నివసిస్తారు, వారికి అంతము లేదు.
యోహాను 11: [25] అందుకు యేసు–పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; [26] బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.
Comments
Post a Comment