రెండు డెక్కలు || Cloven Hooves || Split Hooves

 రెండు డెక్కలు - స్వభావం

దేవాది దేవుడు తనకు దహన బలిగా అర్పించవాడటానికి కోరుకున్న జంతువులు ఏవో చెబుతూనే... వాటికి కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకున్నాడు.


లేవీయకాండము 1:2

–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము – మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు, గోవుల మందలో నుండిగాని గొఱ్ఱెల మందలో నుండిగాని మేకల మందలో నుండిగాని దానిని తీసికొని రావలెను.


లేవీయకాండము 11:3-4

[3] జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చునుగాని [4] నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు...


పవిత్రమైన జంతువులుగా ఉన్న వాటికి ఉన్న రెండు లక్షణాలలో మరొక లక్షణం రెండు డెక్కలు కలిగి ఉండటం. నెమరు వేయడం గురించి మరొక వ్యాసంలో వ్రాయబడి వుంటుంది.  పేజీ చివరలో గమనించండి.  పవిత్రమైన మరియు దేవుడు కోరుకున్న గోవు, మేక, గొఱ్ఱె లకు ఉండే ఈ రెండు గిట్టల యొక్క ఉపయోగం, గొప్పదనం గురించి తెలుసుకుందాం.


డెక్క అంటే గిట్ట 

కాళ్లకు ఉన్న గిట్టలు రెండుగా చీలి వుంటాయి.

గోవు డెక్కలు

గొఱ్ఱె, మేక డెక్కలు

వాస్తవానికి గోవు, బర్రె, మేక, గొఱ్ఱె ఇలాంటివన్నీ ఒకే కుటుంబానికి చెందినవి.  బోవిడే అనే కుటుంబం.  కాబట్టి మీకు కేవలం గోవు గురించి మాత్రమే మాట్లాడుతున్నారే, బర్రె కూడా రెండు గిట్టలు కలిగి ఉండి, నెమరు వేస్తుంది కదా అని అనుకోవచ్చు.  వాస్తవంగా అవి రెండూ ఒకే కుటుంబం కాబట్టి, గోవు అని ప్రస్తావించి వుండవచ్చు.


రెండు డెక్కలు కలిగి ఉండటం వలన భూమి మీద స్థిరంగా నిలబడగలదు.  తన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోగలదు.  రాళ్ళ మీద కానీ, ఇసుకమీద, ఎడారులలో, బురద నీళ్లలో, కొండలమీద, గడ్డి మీద ఎక్కడ తిరిగినా కూడా దాని బ్యాలెన్స్ నిలుపుకోగలవు.


కొన్ని జంతువులను ఉదాహరణగా చూస్తే - 


సింహం:


అడవికి రాజు, అయినప్పటికీ దేవుడు అలాంటి దానిని కోరుకోలేదు.  అంటే గొప్ప గొప్పవారిని, రాజులను, ధనవంతులను, పేరుమోసిన వారిని కావాలని దేవుడు కోరుకోలేదు.  సింహం పాదాలు చూస్తే అవి 5 గిట్టలు కలిగి ఉంటాయి.  పైగా దాని పాదాలు మెత్తగా మైదాన ప్రాంతాలలో, గడ్డి ప్రాంతాలలో, అడవి ప్రాంతాలలో తిరగడానికి మాత్రమే అనుకూలంగా వుంటాయి.


ఏనుగు:


ఏనుగు పాదం మొత్తం ఒకేలా ఉంటుంది.  ఏనుగు బలమైన జంతువు కూడా.  సింహం కూడా ఏనుగుకు భయపడుతుంది.  మరి అలాంటి జంతువును అనగా బలవంతులను కూడా దేవుడు కోరలేదు.  ఏనుగు కూడా అన్ని ప్రాంతాలలో తిరగలేదు, కొండలు ఎక్క గలదా?, ఎడారులలో తిరగగలదా? తిరగలేదు కదా.


గుర్రం:


గుర్రం వేగవంతమైన జంతువు, వేగంగా పరిగెత్త గలదు.  గుర్రం ఒక డెక్క మాత్రమే కలిగి ఉంటుంది.  వాటి గిట్టలు వేరుగా ఉండవు.   గిట్ట మొత్తం కలిసే వుంటుంది.  కాబట్టి గుర్రం మైదాన ప్రాంతాలలో అయితే పరిగెత్తగలగడం, బండ్లు లాగడానికి ఉపయోగ పడుతుంది కానీ ఎడారులు లలో తిరగగలదా?


ఒంటె:


ఎడారి ఓడ అంటారు.  ఎడారులలో నీళ్లు దొరకకపోయినా ఎంత దూరం అయినా ప్రయాణించగలదు.  కానీ ఒంటె కు రెండు గిట్టలు ఉండవు.  పాదం మొత్తం కలిసి ఉంటుంది, ఏనుగు లాగా, మెత్తని పాదం కలిగి ఉంటుంది.  ఒంటె కేవలం ఎడారులలో అయితే తిరగగలదు.  కొండలు ఎక్కగలదా? అడవిలో ముళ్ళ ప్రదేశాలలో, రాళ్ళ ప్రదేశాల్లో, కొండలలో తిరగగలదా?


ఇలా ఏ జంతువును చూసినా నెమరు వేసే స్వభావం + రెండు డెక్కలు గల కలిగి ఉండటం, ఈ రెండు లక్షణాలు మాత్రం కలిగి ఉండవు, ఇక్కడ దేవుడు చెప్పిన జంతువులు తప్ప.


కొండలలో నివసించే గొఱ్ఱెలు కొండ పేటుల మీద తిరుగుతూ ఉంటాయి.




నిట్టనిలువుగా ఉండే కొండలు, డ్యాం లు వంటి వాటి మీదకు ఈ గొఱ్ఱెలు సులభంగా ఎక్కి వెళ్ళగలవు.  ఈ రెండు గిట్టలు కలిగి ఉండటం వలన అవి ఎత్తైన ప్రాంతాలైనా సులభంగా చేరుకోగలవు.   నీటి కోసం డ్యాం ల మీద నిట్టనిలువుగా సిమెంట్ గచ్చు ఆధారంగా కోతులు కానీ, ఇతర ఏ జంతువుకూడా ఎక్కలేని విధంగా కొండ లలో నివసించే గొర్రెలు పైకి ఎక్కగలవు.  ప్రాణహాని వున్నప్పుడు వేరే ఏ క్రూర జంతువు తమను వేటాడలేకుండా కొండ పేటులకు చేరుకొని అక్కడ నివాసం ఉంటాయి. అవి ఎప్పుడో ఒకసారి అలా చేస్తాయా? లేదుకదా, అది వాటి స్వభావం, అవి ప్రతిరోజూ అలానే జీవిస్తాయి, అది వాటికి కష్టం కాదు.

ఆలాగున మనం కూడా అది అసాధ్యం అనే కార్యాలు, నిట్టనిలువుగా ఎత్తైన ప్రదేశాలకు చేరుకోగలగడం.  జీవితంలో కొన్ని సార్లు కలిగే పరిస్థితుల వలన అప్పటివరకూ మనం ఎలాంటి జీవితం గడిపి ఉన్నాకూడా ఒక సమయం వచ్చినప్పుడు ఉన్నతమైన ప్రార్థనా జీవితం, భక్తి జీవితం దేవునిలో అత్యంత బలవంతులముగా జీవించిన రోజులు అనేవి నిజమైన విశ్వాసి గా జీవించే వారి జీవితంలో ఖచ్చితంగా కలిగి వుంటారు.  జీవితంలో లేదా కుటుంబంలో ఒక గొప్ప శోధన వచ్చినప్పుడు దేవునిలో ఎక్కువగా గడపడం, ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపనలు, భక్తి పాటించడం వంటివి ఎక్కువగా చేసి దేవునికి దగ్గరయ్యి మన మనవులు ఆయన నుంచి పొందుకునేలా ప్రయత్నం చేస్తాం.  వాటిని పొందుకున్న తరువాత ఆ భక్తి తగ్గిపోయి వుంటుంది. కానీ ఆ గొర్రెల లాగా మనం అది అలవాటుగా, ప్రతి దినమూ అలాంటి భక్తిని కలిగి జీవించేవారముగా వుండాలి.


ఈ జంతువులకు ఉన్న ఈ లక్షణం నుంచి మనం నేర్చుకోవలసిన ఆత్మీయ సంగతులు:


ఈ జంతువులు తమ మేత కోసం ఎలాంటి ప్రదేశాలలో అయినా తిరగగలవు, అంటే అడవులు, ఎడారులు, కొండలు మరియు లోయ ప్రాంతాలలో తిరిగి మేత మేయగలవు.  ఆ ప్రదేశాలు ఎలాంటివో మనం ఒకసారి పరిశీలిస్తే - 


అడవులు - అడవుల్లో ప్రమాదకర పరిస్థితులు వుంటాయి.  క్రూర మృగాలు వుంటాయి, రక్షణ వుండదు, ప్రాణాలతో తిరిగి బయటికి వస్తామనే గ్యారంటీ వుండదు, ఏమైనా జరగొచ్చు;  అంటే - చాలామంది మన మీద దాడిచేసే వారు వుంటారు, మనకు రక్షణ వుండదు, నీకు మేమున్నాం అనే భరోసా వుండదు.  అలాంటి పరిస్థితులలో తిరిగి సేవ చేయగలగేవారు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.  కష్టమైన ప్రదేశాలలో, సేవ చేసే లక్షణాన్ని దేవుడు కోరుకుంటున్నాడు.


ఎడారులు - ఎడారులలో నీరు, ఆహారం వుండదు.  విపరీతమైన ఎండ, నీడ దొరకదు, వడగాలులు, విశ్రాంతి దొరకదు; అలాంటి పరిస్థితులు అంటే - ఆకలి దప్పులకు ఓర్చుకోగలగాలి.  విశ్రాంతి లేని జీవితం.  ఒక ఆధారం, నిరీక్షణ అంటూ లేని సమయాలలో కూడా మనం ఆయన సేవలో కొనసాగగలగాలి.


కొండలు - ఎవరైనా సరే ఎత్తైన కొండలు ఎక్కితే గొప్పగా, ఏదో సాధించినట్లు ఫీల్ అవుతూ వుంటారు కదా.  మనం సువార్త లో అలాంటి స్థానాన్ని చేరుకోగలగాలి.  కొండలు అందరూ ఎక్కగలరా? ఫిట్ గా ఉంటేనే, మంచి శరీర ధృడత్వం ఉంటేనే చేరుకోగలరు.  బద్ధకస్తులు, సోమరులు, శరీర దృఢత్వం లేని వారు, కొవ్వు పట్టిన వారు అలాంటి ప్రదేశాలను చేరుకోలేరు.  మన శరీరం దృఢంగా వుండాలి అంటే రన్నింగ్ లు, ఎక్సర్సైజ్ లు చేయాలి, బలమైన తిండి తినాలి. చాలా తక్కువమంది మాత్రమే అలాంటి ప్రదేశాలను చేరుకోగలరు మరియు అలా చేరుకున్న వారు మంచి పేరు సంపాదించగలరు. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. 

ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, చాలా తక్కువ మంది మాత్రమే అలాంటి సేవ చేయగలరు.  అలాంటి సేవ చేయాలి అంటే మన ఆత్మీయ స్థితి చాలా బలంగా ఉండాలి, అలా ఆత్మలో బలం కలిగి వుండాలి అంటే మనం ఎక్కువగా వాక్యం ను ధ్యానించాలి.  అప్పుడే మనం చేసే సేవలో, మన విశ్వాస జీవితంలో ఉన్నత స్థానాలను, కొండ ప్రాంత అనుభవాలను చేరుకోగలము.


లోయలు - చీకటి ప్రాంతాలతో సమానం.  ఎవరైనా కొండలు ఎక్కడానికి ఇష్టపడతారు కానీ, లోయలలో తిరగడానికి ఇష్టపడకపోవచ్చు.  ఇది ఎలా అర్థం చేసుకోగలము అంటే - ఎవరూ వెళ్ళని ప్రదేశాలు, ఎవరూ తిరగడానికి అంతగా ఇష్టపడని ప్రదేశాలు, ఎవరూ ఎప్పుడూ సువార్త చేయని ప్రదేశాలు, రోగులు, దీనులు, దరిద్రులు, దిక్కులేని వారు నివసించే చోటుకు వెళ్ళి సువార్త ప్రకటించగలగడం.


ఎలాంటి ప్రదేశాలలో అయినా ఈ జంతువులు తిరగగలవు. అవి రెండు గిట్టలు కలిగి ఉండటం మూలంగా ఎలాంటి ప్రదేశాలలో అయినా స్థిరంగా నిలబడగలవు, పరిగెత్తగలవు. కాబట్టే అలాంటి లక్షణాలను కలిగి వుండేవారంగా మనం ఉండాలని ఎలాంటి సమస్యలలో అయినా,

ఎలాంటి పరిస్తితుల్లో అయినా,

కఠినమైన సమయాలలో,

కఠినమైన ప్రదేశాలలో,

దాడులు జరిగే అవకాశం ఉన్నా,

మరణం సంభవించే అవకాశం ఉన్నా,

ఆకలి దప్పులు ఉన్నా,

విశ్రాంతి లేకున్నా,

ఈ లోకంలో అంటూ మనకు ఒక నిరీక్షణ లేకపోయినా, ఆత్మలో బలవంతులముగా అతికొద్ది మంది మాత్రమే చేయగలసేవ చేయగలవారముగా,

ఎవరూ ఇష్టపడని దీనులకు, దరిద్రులకు సేవ చేసేవారముగా,

ఎప్పుడూ ఎవరూ సేవ చేయని ప్రాంతాలలో సేవ చేసేవారముగా,

నిట్టనిలువు గా జీవితంలో ఒక్కసారిగా మనలోని విశ్వాసాన్ని, భక్తిని పెంచుకోవలసిన సమయాలలో మాత్రమే మనం అలాంటి భక్తిని ప్రదర్శించేవారముగా కాకుండా, ప్రతిదినమూ అలా నిట్టనిలువుగా పైకి ఎక్కగలిగే సామర్థ్యం కలిగి ఉండేవారముగా, అది అలవాటుగా ఉండేవారముగా మనం జీవిద్దాము. అలాంటి స్వభావం ఉన్న జంతువులను దేవునికి బలిగా కావాలని కోరుకుంటున్నాడు.


కాబట్టి మనం ఈ జంతువుల నుంచి నేర్చుకునే సంగతులు గొప్పగా వుంటాయి. వాటిని మనం గ్రహించుకుని మన జీవితాలలో అన్వయించుకున్నప్పుడే మనం కూడా ఆ జంతువుల నుంచి దేవుడు కోరుకున్న లక్షణాలను కలిగి ఉండి దేవునికి ఆ జంతువులు అర్పించబడినప్పుడే అది ఇంపైన పరిమళ హోమము గా ఉంటుంది కదా. మనం కూడా అలాంటి లక్షణాలు కలిగి దేవుని పనిలో వాడబడినప్పుడే మన సేవ కూడా పరిమళ హోమముగా వుంటుంది.

Comments

Popular posts from this blog

నెమరు వేయుట || Chewing the cud || Rumination

తూరు - పొరుగున వున్న పట్టణం