మంచి గొఱ్ఱెల కాపరి

మంచి గొఱ్ఱెల కాపరి

యోహాను సువార్త 10 వ అధ్యాయం లో వున్న సంగతులు

యేసు క్రీస్తు ప్రభువు సువార్త ప్రకటిస్తూ ప్రజలకు వారి పాపాల నుంచి విడుదల, రక్షణ, నిత్య జీవం, పరలోక రాజ్యం గురించిన సంగతులు బోధిస్తూ సామాన్య ప్రజలకు కూడా అర్థం అయ్యేందుకు ఉపమానాలతో చాలా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేసేవాడు.

యేసు క్రీస్తు ప్రభువు తనను తాను ఒక గొఱ్ఱెల కాపరిగా, సంఘంలో ఉన్న విశ్వాసులను గొఱ్ఱెల దొడ్డిలో వున్న గొఱ్ఱెలుగా పోల్చి వివరించడానికి ప్రయత్నం చేస్తూ వుంటాడు ఈ అధ్యాయం లో. ఎందుకంటే ఆ ప్రాంతాలలో గొఱ్ఱెల పెంపకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా వాటిని ఉదాహరణగా తీసుకొని చెబితే అర్థం అవుతుంది అనే ఉద్దేశ్యం తో ఈ విధంగా చెప్పాడు ఆయన. మనం బైబిల్ లో పరిశీలించినా… మొదట నుంచి చూసినా… యాకోబు, మోషే, దావీదు ఇలా చాలామంది గొర్రెల కాపరులే. 

యోహాను 10:4 - మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.

వెలుపలికి నడిపించునపుడెల్ల - అని వుంది కదా. ఎందుకు బయటికి తోలుకొని వెళ్లేటప్పుడు ప్రతీ సారి వాటికి ముందుగా నడవాలి?

గొఱ్ఱెలదొడ్డి అనేది ఒక విశ్రాంతి స్థలం. పగటి సమయంలో చాలా ప్రదేశాల్లో తిరుగుతూ మేతమేసి దొంగల భయమో క్రూరమృగాలు వచ్చి పట్టుకుని వెళతాయనో ఎక్కడపడితే అక్కడ విశ్రాంతి తీసుకోలేవు. అదే గొఱ్ఱెల దొడ్డిలో అయితే రక్షణ ఉంటుంది కాబట్టి, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాయి.

గొఱ్ఱెలు మేత మేయటానికి బయటికి వెళ్లాల్సిందే. కాపరి యొక్క కాపుదల కేవలం గొఱ్ఱెల దొడ్డిలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటే ఉపయోగం ఉండదు కదా గొఱ్ఱెలు బయట తిరిగే సమయాలలో కూడా కాపరి కాపుదల అవసరం.

అలాగే మనకు కూడా దేవుని మందిరం ఒక విశ్రాంతి స్థలం, మన ఆత్మకు ఆదరణ కలిగించే స్థలం. తర్వాత మనం తిరిగి లోకంలోనికి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఆయన మనం ఈ లోకాధికారి అయిన సాతాను స్వాధీనంలో ఉన్న ఈ లోకంలో సంచరించే సమయంలో మనకు ముందుగా ఆయన ఉంటానని చెబుతున్నాడు.

లూకా సువార్త 4:5-6

[5] అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి [6] –ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును;

యోహాను సువార్త 14:30

....ఈ లోకాధికారి వచ్చుచున్నాడు....

లోకంలో ఉన్న మిగతా గొర్రెలు ఈ లోకాధికారి అయిన వాని ఆధీనం లో ఉన్నాయి కాబట్టి, ఈ లోకమంతా వారు సంచరించవచ్చు. వారు కోరుకున్నచోటికి వెళతారు, అనుకున్న పనిని చేస్తారు, ఏ పని చేయడానికి అయినా వారికి అభ్యంతరం వుండదు. కానీ మనం ఆయన మందలో ఉండాలనుకుంటే లోకానికి వేరై జీవించాల్సి ఉంటుంది. అప్పుడే మనం నడవవలసిన మార్గం లో దేవుడు మనకు ముందుగా ఉండి నడిపిస్తాడు.

ఫిలిప్పీయులకు 4:7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.

గొఱ్ఱెలు దొడ్డిలో నుంచి బయటకు వెళ్లినప్పుడల్లా ఆయన వాటికి ముందుగా నడుచును అని ఆయనే చెప్పాడు. ఈ వచనం ప్రకారం మనం ఈ లోకంలో తిరిగేటప్పుడు అని మాత్రమే కాకుండా, మన హృదయ తలంపులకు ఆయన కావలి కాస్తాడు. మనం ఆయన మందలో వున్నప్పుడు మనం ఒక ఆలోచన చేస్తే మా ఆలోచనకు ముందుగా దేవుడు ఉంటాడు. మన హృదయంలో నుంచి వచ్చే ప్రతి తలంపుకు ముందుగా ఆయన తోడుగా ఉంటాడు. మనం ఒక చూపు చూస్తే ఆ చూపుకు ముందుగా దేవుడు తోడుగా ఉంటాడు. మనం ఒక మాట మాట్లాడితే ఆ మాటకు ముందుగా దేవుడు తోడుగా ఉంటాడు. ఇవన్నీ మందలో ఉన్నప్పుడు, ఆయనకు లోబడి జీవించినప్పుడు జరుగుతాయి.

యోహాను 10:4 - ... గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.

మీరు కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ లక్ష మందిలో వున్నా మీ తల్లిదండ్రులు లేదా మీ పిల్లలు మాట్లాడితే వారి స్వరాన్ని గుర్తు పట్టగలరు. ఎందుకంటే వారితో మీకు ప్రతి రోజు సహవాసం వుంది. మీ తల్లిదండ్రులు లేదా పిల్లలతో ప్రతిరోజు మీరు మాట్లాడతారు. చాలా కాలం కిందట మనతో మాట్లాడిన వ్యక్తి మనలను పిలిస్తే వారిని చూడకుండా మనం గుర్తు పట్టలేము. ఎందుకంటే వారితో మనకు సహవాసం కొనసాగింపు లేదు. కాబట్టి మనం దేవునితో ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నప్పుడే మనతో మాట్లాడింది దేవుడా? కాదా? అనే విషయం గ్రహించగలం.

వాక్యం చదవడం ద్వారా ఆయన మనతో మాట్లాడుతాడు. ప్రార్థన చేయటం ద్వారా మనం దేవునితో మాట్లాడతాము. ప్రార్ధన అనుభవం లేకుండా, వాక్యం చదవకుండా, మనకు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేసి లేదా వాక్యం చదివితే మనతో మాట్లాడే స్వరం ఎవరిదో గుర్తు పట్టగలమా?

ఉదాహరణకు మన ఫోన్ ను తీసుకోండి. మనతో ఎవరు మాట్లాడుతున్నారో ఫోన్ ఎత్తి మాట్లాడితేనే తెలుస్తుంది. మనకు ఎవరు మెసేజ్ లు పెట్టారో మనం తెరచి చూస్తేనే తెలుస్తుంది. అలాగే బైబిల్ ను మనం తెరచి చదవకుండా, మనం ఆయన చెప్పే విషయాలను ఎలా తెలుసుకోగలం?

చాలా కాలం కిందట మాట్లాడిన ఒక వ్యక్తి నాతో మాట్లాడితే నేను కళ్ళు మూసుకొని అతని గుర్తుపట్టగలనా?

గొఱ్ఱెలు తమ కాపరిని ఎలా గుర్తుపడతాయి? గొఱ్ఱెల కాపరి ప్రతిరోజు తన గొఱ్ఱెలను కేక వేస్తూ పిలుస్తూ ఉంటాడు, కాబట్టి తమ కాపరి స్వరాన్ని గొఱ్ఱెలు సులభంగా గుర్తుపట్టగలవు. అదేవిధంగా మనం ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడే మనం ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలము.

యోహాను 10:06 యేసు వారితో ఈ సాదృశ్యము చెప్పెను కానీ గానీ ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకోలేదు.

నా గొర్రెలు నా స్వరము వినును - అని దేవుడు అన్నాడు కదా, మరి యేసు క్రీస్తు ప్రభువు ఈ విషయాలు చెబుతున్నా కూడా ఎందుకు ఆనాటి ఇశ్రాయేలీయులు అర్థం చేసుకోలేక పోయారు?

పాతనిబంధన గ్రంథంలో చివరి ప్రవక్త మలాకి. మలాకి ప్రవక్త క్రీస్తు పూర్వం 450-425 సంవత్సరాల మధ్య కాలంలో నివసించాడు. అప్పటినుంచి యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడానికి దాదాపుగా 450 సం., పట్టింది కదా. అంటే 450 సం., మలాకి నుంచి బాప్తిస్మం ఇచ్చు యోహాను లేదా యేసు క్రీస్తు ప్రభువు వచ్చే వరకూ మధ్య లో 400 సం., కంటే ఎక్కువ రోజుల పాటూ వారు దేవుని స్వరాన్ని వినలేదు. అంతవరకూ కూడా చాలామంది ప్రవక్తలు వచ్చారు. వారందరూ దేవుడు వారితో చెప్పమన్న మాటలు, గద్దింపు మాటలు, ప్రవచనాలు, ఓదార్పు మాటలు అన్నీ చెప్పేవారు. ఆ ప్రవక్తలను ఆనాటి ప్రజలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం దాదాపుగా యెహోవా తమ దేవుడు అనే విషయం మరిచిపోయి ప్రవర్తించడం వలన కొన్ని వందల సం., ల పాటూ ఆయన వారితో మాట్లాడలేదు. అందుకే అన్ని సంవత్సరాల తరువాత ఆయన వచ్చి వారితో మాట్లాడినా, ఎన్ని ఉపమానాలు చెప్పినా వారికి అర్థం కాలేదు. ఆయనే వారి దేవుడు ఆయనే రక్షకుడు అని వారికి అర్థం కాలేదు. ఆయన స్వరం వారు గుర్తు పట్టలేక పోయారు.

 యోహాను 10:7-9 - [7] కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను [8] –గొఱ్ఱెలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱెలు వారి స్వరము వినలేదు. [9]. నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.

 - నేనే ద్వారమును -

దొంగలు రాకుండా కంచె లేదా గోడ వుంటుంది. గొఱ్ఱెల కాపరులు ఒక ద్వారం ఏర్పాటుచేసుకుని వుంటారు.  కాపరి ఆ ద్వారం దగ్గర నిలబడి లోపలికి వెళ్లే గొఱ్ఱెలను గాని బయటికి వచ్చే గొఱ్ఱెలను గానీ పరిశీలిస్తూ ఉంటాడు. గొఱ్ఱెలు ఏవైనా గాయపడ్డాయా? ఏవైనా తప్పిపోయాయా? అని గమనిస్తూ ఉంటాడు.

యేసు క్రీస్తు ప్రభువు నేనే మార్గమును అని అంటున్నాడు. కాపరి గొఱ్ఱెలను పరిశీలించినట్లు ద్వారం గా ఉన్న యేసు క్రీస్తు ప్రభువు మనం ఆ ద్వారం నుంచి లోపలికి అంటే దేవుని మందిరంలోనికి ప్రవేశించేటప్పుడు మనలను పరిశీలిస్తూ ఉంటాడు.

కాపరి కి చెందిన మంద మాత్రమే ఆ ద్వారం గుండా లోనికి ప్రవేశించి కాపరి సంరక్షణలో క్షేమంగా ఉంటుంది.

అదేవిధంగా ఆయన మన ప్రధాన కాపరి అని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరియు ఏసుక్రీస్తు అనబడే ద్వారం గుండా రక్షించబడి లోపలికి చేర్చబడిన వారు అంటే సంఘంలోకి చేర్చబడిన వారు, వారిని వారి కదలికలను ఆ ద్వారమై వున్న ఏసుక్రీస్తు ప్రభువు మనం లోనికి వచ్చేటప్పుడు బయటికి వెళ్లేటప్పుడు మన హృదయాలను పరిశీలిస్తూ ఉంటాడు.

9 - నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై -

ఆయన ద్వారా లోపలికి ప్రవేశిస్తే రక్షణ ఎలా?

ఎక్కడైనా ముఖ్యమైన మీటింగ్ ప్లేస్ పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర, బ్యాంక్ దగ్గర కానీ, ముఖ్యమైన నాయకులు వచ్చినప్పుడు కానీ ప్రవేశ ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్స్, స్కానర్స్ ఉంటాయి. అవి మన దగ్గర ఏవైనా కత్తులు, గన్ లు లాంటివి ఉంటే అవి వెంటనే అలారం మోగిస్తాయి. 


ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో ఎయిర్పోర్ట్, షిప్ లను లోడింగ్ చేసే చోట్ల పెద్ద పెద్ద కంటైనర్లు వుంటాయి. వాటిని అన్నిటిని లోపల తీసి చూడటం సాధ్యం కాదు. ఈ స్కానర్ల ద్వారా అవి లోపలికి వెళ్ళినప్పుడు వాటి లోపల ఏముందో ఆ స్కానర్ లు స్క్రీన్ మీద సెక్యూరిటీ వారికి చూపిస్తూ ఉంటాయి.

ఆ ద్వారం గుండా వెళితే చాలు మన దగ్గర ఏమున్నాయో, లేకపోతే కంటైనర్ లారీ లలో ఏమున్నాయో స్కానర్లు  కనుక్కోగలుగుతున్నాయి.  మరి మనలను సృజించిన దేవుడు మన హృదయం లో ఏముందో చూడలేడా?

ఈ స్కానర్లు అన్ని కూడా మన దగ్గర ఏమున్నాయో ఎలాగయితే స్కాన్ చేసి పరిశీలిస్తుందో, అలాగే ఆ గుమ్మం, గొఱ్ఱెల దొడ్డి ద్వారం, ప్రవేశ ద్వారం తో తనను తాను పోల్చుకుంటున్న ఏసుక్రీస్తు ప్రభువు కూడా మన హృదయంలో ఏముందో పరిశోధిస్తూ ఉంటాడు. మనం ఆ ద్వారం గుండా లోనికి ప్రవేశించే సమయంలో మన హృదయం దేనితో నిండి ఉందో ఆయన స్కాన్ చేస్తూ ఉంటాడు.  

మనం నామకార్థ భక్తి కలిగి ఉన్నామా?

మన సహోదరుల పట్ల ద్వేషం కలిగి ఉన్నామా?

ఇతరులను మోసం చేసి అబద్ధం ఆడి లేదా ఒక వస్తువు దొంగతనం చేసి ఇక్కడ కూర్చొని ఉన్నామా?

మన హృదయం అపరాధ భావంతో నిండి ఉందా?

లేదా దేవుని పట్ల కృతజ్ఞతా భావంతో నిండి ఉందా?

ఇలా ఏ విషయాలు అయినా ఆయన స్కాన్ చేస్తూ ఉంటాడు. మనతో పాటు కూర్చున్న వ్యక్తులకు మన హృదయంలో ఏమి ఉందో వారు గ్రహించలేకపోవచ్చు కానీ హృదయాలను పరిశోధించువాడు సంగతులు మొత్తం బాగా ఎరిగి ఉన్నాడు.

మనల్ని ఎవరూ కనుక్కోలేరు అని అనుకుంటే అక్కడ స్కానింగ్ లో దేవుడు మన హృదయంలో ఉన్న మొత్తం సంగతులు చూస్తూ ఉంటాడు.

అందుకోసం మనం ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు పరిశుద్ధత కలిగి జీవించడం అవసరం. అలా లోపలికి వచ్చినప్పుడే, మందలో చేర్చబడినప్పుడే, కాపరి కాపుదలలో ఉంటాం కాబట్టి రక్షణ ఉంటుంది.

గొఱ్ఱెలకు రక్షణ ఎక్కడ ఉంటుంది, దొడ్డి లోనా, బయట ఉన్నప్పుడా? బయట పొలాల్లో వుంటే - కుక్కలో, నక్కలో, తోడేళ్లో, క్రూర మృగాల వలనో, దొంగల వలన వాటికి ప్రాణహాని వుంటుంది. దొడ్డి లో అయినా సరే మందలో అయినా సరే ఆయన కాపుదల ఉంది.

నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడును రాలేడు. అని యేసు క్రీస్తు ప్రభువు అంటాడు కదా. ఆయనే ద్వారం, ఆయనే మార్గం.  మందిరం లోనికి రావాలంటే ఇనుప గేట్ లేదా చెక్క తలుపు వుంటుంది, దొంగలు ఎలాగోలా పగలగొట్టుకొని వస్తారు. కానీ పరలోకం వెళ్లాలంటే యేసు క్రీస్తు ద్వారా మాత్రమే వెళ్ళగలరు ఎవరైనా.  ఒక దొంగనో ఒక క్రూర మృగంలాగానో పక్కనుంచి ఎక్కి రాలేరు, ఎందుకంటే అది పరలోక రాజ్యం దానికి మార్గం ఒకటే

ఆ మార్గం ఏసుక్రీస్తు ప్రభువు

యోహాను 10:10 -  దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

దొంగ మన దగ్గర ఉన్నది దోచుకోవడం కోసం వస్తాడు. కానీ ఏసుక్రీస్తు ప్రభువు మన దగ్గర లేని దానిని మనకు ఇవ్వడం కోసం వచ్చాను అని చెబుతున్నాడు.

సృష్టి ప్రారంభంలో దేవుడు ఆదాము హవ్వలను ఏదేను తోటలో ఉంచి వారికి ఫలించి అభివృద్ధి పొందండి అని ఈ భూమిని స్వాధీనం చేశాడు. సాతాను దొంగ, దోచుకొను వాడు కాబట్టి దేవుడు వారికి ఇచ్చిన ఆ స్వాస్థ్యాన్ని వారిని మోసం చేసి వారి దగ్గర నుంచి దోచుకున్నాడు. కాబట్టి వారికి నిత్య జీవం లేకుండా పోయింది. వారి వద్ద నుంచి సాతాను మొత్తం భూమిని స్వతంత్రించుకొని వాని ఆధీనంలో ఉంచుకున్నాడు. అందుకనే వాడు లోకాధికారి అయ్యాడు.

కాబట్టి ఒకప్పుడు హవ్వ ఆదాము ఏదేను తోటలో ఉన్నప్పుడు తోట చుట్టూ కంచలేదు. కాబట్టి సులువుగా సాతాను ప్రవేశించి వారిని మోసం చేయగలిగాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు తన మందిరాన్ని ఏర్పాటు చేసి రక్షించబడిన వారు తప్పిపోకుండా మార్గం నుంచి తొలగిపోకుండా వారిని తన కాపుదలలో ఉంచి రక్షిస్తూ తానే కాపరిగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ద్వారం దగ్గర నిలబడి ఉండి పరీక్షిస్తూ వున్నాడు.

ఆదాము హవ్వ లు చేసిన తప్పుకు వారికి దేవుడు శిక్ష విధించాడు. కానీ వారు అప్పటికే దేవుడు తమకు ఇచ్చిన జీవాన్ని కోల్పోయారు. ఎందుకంటే దేవుడు వారికి స్పష్టముగా ఆజ్ఞాపించాడు కదా - మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తోట మధ్యలో ఉంచి వాటిని తినవద్దు అని చెప్పి ఒకవేళ వాటిని తింటే, నీవు వీటిని తిను దినమున నిశ్చయముగా చనిపోదువు. అని చెప్పాడు. కాబట్టి వారు మరణాన్ని పొందారు. అలా మరణం ఈ భూమి మీదికి ప్రవేశించింది.

కాబట్టి మానవులు కోల్పోయిన ఆ జీవాన్ని మళ్లీ తిరిగి ఇవ్వడానికి, నిత్యజీవం మనకు ఇవ్వటానికి నేను వచ్చాను అని ఏసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడు.

-----------------------------------                              

యోహాను 10:11 - నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెల కొరకు తన ప్రాణము పెట్టును.

ఎవరైనా ఒక మంచి తండ్రి లేదా ఒక మంచి టీచర్ etc., అని ఎప్పుడు పిలవబడతారు.

తమ మీద ఉన్న బాధ్యత ఎప్పుడైతే వారు శ్రద్ధగా నిర్వహిస్తారో వారు మంచి తండ్రి లేదా టీచర్ గా పిలవబడతారు.

మంచి తండ్రి అంటే పిల్లల ఆరోగ్యం, పోషణ, చదువు, రక్షణ, వారు చేస్తున్న పనులు గమనించటం అన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించగలిగినవాడు. మంచి తండ్రి కాని వాడు అంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, పిల్లల చదువును నిర్లక్ష్యం చేసి వ్యసనాలకు లోనై కుటుంబం విచ్చిన్నమయ్యేందుకు కారణమై తనతో పాటు తన పిల్లలు కుటుంబం భవిష్యత్తును నాశనం చేసేవాడు.

అలాగే ఒక మంచి టీచర్ అంటే తన విద్యార్థి లో ఉన్న లోపాలు ఏవి? అతనికి ఎందుకు చదువు రావడం లేదు అని గమనించి అతనికి అర్థం అయ్యేలాగా బోధించి అతడు ఒక మంచి జీవితాన్ని జీవించగలిగేలా, మంచి విషయాలు బోధించి నేర్పించి అవసరం అయితే దండించి అయినా సరే సరైన దారిలో నిలబెట్టగలిగేవాడు. అంటే నశించి పోవలసిన దానిని గొప్పదిగా తీర్చిదిద్దడం

అలా ఒక మంచి గొఱ్ఱెల కాపరి అని అంటే - తనకు అప్పగించబడిన గొఱ్ఱెల గురించి శ్రద్ధ తీసుకోవడం. అంటే వాటి ఆరోగ్యం ఎలావుంది? ఏవి సరిగ్గా తింటున్నాయి? ఏవి సరిగా తినడం లేదు? వాటి స్థితి ఎలా ఉంది? ఏవైనా గొఱ్ఱెలు ముళ్లు కుచ్చుకొని కుంటుతూ వున్నాయా? ఏవి ఇతర గొఱ్ఱెలతో పోట్లాడుతూ వున్నాయి? ఏవి బలహీనంగా వున్నాయి? అనే విషయాలు మంచి కాపరి ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు.

మంచి గొఱ్ఱెల కాపరి ఏ విధంగా అయితే తన మంద బాగోగులు చూస్తాడో, నీరు, మేత, రక్షణ - అలా దేవుడు కూడా తన మందలో ఉన్న విశ్వాసుల ఎదుగుదలకు కావలసినవన్నీ సమకూరుస్తాడు.

తన మందను మంచి మేత వున్న ప్రాంతాలకే నడిపించినట్లు, విశ్వాసులకు కావలసిన వాక్యం ఎల్లప్పుడూ అందిస్తూ వుంటాడు.  ఆ లక్షణాలను పరిశీలిస్తే - 

ముల్లు కుచ్చుకొన్న పరిస్థితులు:

ఏదైనా శోధన, బాధలలో వున్నప్పుడు గొఱ్ఱెల కాపరి తన మందలోని గొఱ్ఱె ముళ్ళు గుచ్చుకుని బాధపడుతూ ఉంటే చూసి చూడనట్లు వదిలేస్తాడా? మంచి కాపరి ఏ విధంగా అయితే దానిని దగ్గరకు తీసుకుని దానికి ఉన్న బాధల నుంచి విడిపిస్తాడో దేవుడు కూడా మనకు ముళ్ళు వంటి పరిస్థితులు సంభవించినప్పుడు, మనం భరించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన చూసి మనలను అటువంటి పరిస్థితుల నుంచి తప్పించగలడు.

ఒక కాపరి కావాలని ఒక ముళ్ళు తీసుకొని గొఱ్ఱెల ముందర వేసి అవి తొక్కి బాధపడుతూ ఉంటే మళ్ళీ వాటిని తీస్తాడా? నిజంగా అలా చేస్తాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడు కదా. అదే విషయం యాకోబు పత్రికలో వ్రాయబడి ఉంటుంది.

యాకోబు 1:13 - దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు–నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.

కాపరి ముందుగా వెళుతూ వుంటాడు. ఆయన స్వరం ఎరిగి ఆయన ఎటువైపు వెళుతున్నాడో ఏం చెబుతున్నాడో గమనించుకుంటే మనం సరైన దారిలో వెళ్లగలం. గొర్రెలు కాపరిని గమనించక పోతే అవి దారి తప్పుతాయి. సరైన దారిలో వెళ్లలేవు. ముళ్ళ తుప్పలు, కంప చెట్లలోకి వెళతాయి. అక్కడ ముళ్ళు కుచ్చుకుంటాయి. అదే కాపరిని వెంబడించి ఉంటే ఆ సమస్య ఉండదు. కాపరి మన శోధనలనుంచి ముందుగా వెళుతూ వాటన్నిటి నుంచి మనలను తప్పించి నడిపిస్తాడు.  

---------------------

పోట్లాడే స్వభావం ఉన్న వాటిని మిగిలిన వాటికి ఎడమగా కట్టివేయడం, అప్పుడు అవి అటు ఇటు వెళ్ళి ఇతర వాటితో గొడవ పడలేవు.

మందలో ఉండే కొన్ని పోట్లాడే స్వభావం ఉన్న గొఱ్ఱెలు అంటే సంఘంలోనే ఉంటూ... విశ్వాసులే, కానీ అతి చేస్తూ, ఇతరులతో గొడవపడే స్వభావం ఉంటే, హెచ్చించుకునే స్వభావం ఉంటే, గర్వం కలిగి ఉంటే వాటి బారి నుంచి మిగిలిన గొఱ్ఱెలను కాపాడడం కోసం వీటిని ఒక గుంజకు కట్టి వేసే విధంగా అలాంటి గొడవ పడే మనస్తత్వం ఉన్న వారిని దేవుడు కొన్ని పరిస్థితులకు కట్టివేస్తాడు. వారు దానిని గమనించుకొని పశ్చాత్తాపం చెందితే తప్ప, అంటే ఆ గొఱ్ఱెలు పోట్లాడే స్వభావం ఉన్నంతకాలం వాటిని వదిలిపెట్టకుండా కట్టి వేసే విధంగానే వీరికి మారుమనస్సు లేనంత కాలం వీరిని కూడా దేవుడు అదే పరిస్థితుల గుండా నడిపిస్తాడు.

---------------------

నడవలేని స్థితిలో ఉన్న చిన్న గొఱ్ఱె పిల్లలను మంచి కాపరి తన భుజాల మీద ఎత్తుకొని మోసుకొని వెళతాడు.

అలాగే బలహీనమైన స్థితిలో ఉన్న అంటే విశ్వాసంలో కొత్తగా పుట్టిన వారిని, కొత్తగా దేవునిని విశ్వసించిన వారిని ఆయన మరి ఎక్కువగా శ్రద్ధ తీసుకొని వారిని తన భుజాల మీద మోసినట్లుగా కాపాడుతూ ఉంటాడు.

చిన్న గొఱ్ఱె పిల్ల మరి దేని గురించి అయినా ఆలోచించవలసిన అవసరం ఉంటుందా? ఉండదు. గమ్యం చేరేంతవరకు కూడా మంచి కాపరి దానిని క్షేమంగా తీసుకుని వెళతాడు.

క్రైస్తవులుగా ఈ లోకంలో నుంచి రక్షింపబడిన మనం మొదట్లో ఇలాంటి అనుభవాలు చాలా చూసి ఉంటాము. ఎన్నో శ్రమలు నిందలు బాధలు అవమానాలు అన్ని పరిస్థితులకుండా మనం నడిచి వెళ్లకుండా ఆయన మనకు ఎంతగానో సహాయం చేసి మనం ఆయన యందు విశ్వాసంలో బలపడే వరకు ఆయన మనలను తన భుజాల మీద మోసుకొని వచ్చాడు.

#############

కొత్త నిబంధనలో జరిగే ప్రతి విషయము కూడా ఛాయా రూపంలో పాత నిబంధనలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఏసుక్రీస్తు ప్రభువు బోధించిన ఈ ఉపమానం మొత్తం కూడా యెహెజ్కేలు గ్రంథంలోని ప్రవచనాల నుంచి ఆయన బోధించాడు.

యెహెజ్కేలు 34:16 - తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను.

ఇంతవరకు మనం తెలుసుకున్న విషయాలు కూడా ఇవే కదా. ఆయన ఏం మాట్లాడినా కూడా పాత నిబంధనలో ఉన్న ప్రవచనాల ఆధారంగానే మాట్లాడేవాడు.

ఈ ప్రవచనాలు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడినవి. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన రాజులు న్యాయాధిపతులు కాలంలో దేవుని ప్రజలను వారు సరైన దారిలో నడిపించలేకపోవటం వలన ఇశ్రాయేలు జనాంగం చెదిరిపోయారని వారి గురించిన శ్రద్ధ తానే తీసుకుంటానని దేవుడు యెహెజ్కేలు ద్వారా ప్రవచనం చెప్పించాడు.

పాత నిబంధనలోని ప్రవచనాలు యొక్క వివరాలను చాలా సంగతులు ఏసు క్రీస్తు ప్రభువు కొత్త నిబంధనలో అర్థమయ్యేలాగా బోధిస్తూ ఉంటాడు. కానీ ఈ వచనం పాత నిబంధనలోనే స్పష్టంగా చెప్పబడి ఉంది. కానీ వారు ఆయన మందలో చేరకపోవడం వలన, ఆయన కాపుదలలో వారు లేకపోవడం వలన వారు ఆయన స్వరాన్ని గుర్తించలేక పోయారు.

యెహెజ్కేలు 34:31 - నా గొఱ్ఱెలును నేను మేపుచున్న గొఱ్ఱెలునగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

పాత నిబంధనలోనే స్పష్టంగా చెప్పినప్పటికీ వారు దేవునితో సంబంధం కలిగి ఉండకపోవడం వలన ఆయన మాట్లాడుతున్నప్పటికీ ఆయన ఎవరో వారు కనుక్కోలేకపోయారు. తమ కాపరి స్వరాన్ని గుర్తు పట్టలేకపోయారు.

--------------------

యోహాను 10:11 - నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; - మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.

ప్రాణం పెట్టవలసిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు. లేదా చేయకూడని పాపాలు చేసి శిక్ష విధికి గురి అయినప్పుడు.

గొర్రెలు ఎవరిపోలంలోనయినా పడి మేసి పంట నష్టం కలిగిస్తే, వాటి వలన ఇతరులకు నష్టం కలిగితే, వాటిని ఆ పొలం యజమానులు కట్టేసారు అనుకోండి, అవి వారి పొలంలో తిన్నాయని, తోలుకొని పోయి వాళ్ళ దొడ్డిలో కట్టి వేస్తారు. వాటి యజమాని అవి చేసిన నష్టానికి అతనే ఎంతో కొంత డబ్బులు కట్టి వాటిని విడిపించి తీసుకుని వెళతాడు

యజమాని తన గొఱ్ఱెలు బందీ గా వున్నప్పుడు వాటి గురించి పట్టించుకోలేదు అనుకోండి, వాటిని తోలుకొని పోయిన వారు/ వాటిని బంధించిన వారు వాటిని కోసుకొని తింటారు.

అలాగే మనుష్యులు కూడా దేవుడు విధించిన కట్టడలు, ఆజ్ఞలు తెలుసుకోకుండా, చెప్పినా వినకుండా అలా వెళ్లి నశించిపోతూ వుండగా, వారు చేసిన తప్పులకు, పాపాలకు వారికి శిక్ష విధించబడవలసి వుండగా, సాతాను బందీలో, వాని చెరలో మనలను ఉంచుకొని ఉండగా, అటువంటి గొఱ్ఱెల కోసం

కరుణామయుడు అయిన దేవుడు, మంచి గొఱ్ఱెల కాపరి కాబట్టి, తన గొఱ్ఱెలను విడిపించడం కోసం దేవుడు విమోచన క్రయ ధనంగా తన ప్రాణం ఇచ్చాడు. మనం మందిరానికి రాకుండా సినిమాలకు వెళ్లేవాల్లము, ప్రార్థన చేసుకోకుండా ఆ సమయాన్ని సీరియల్ చూడటానికి వాడేవాళ్ళం. బైబిల్ చదవకుండా మొబైల్ ఫోన్ చూసేవాళ్ళము.

కాబట్టి మనలను ఇలా సాతాను ఒకప్పుడు సినిమాలకు, సీరియల్ లకు, మద్యానికి, అబద్దాలకు ఇలాంటి ఎన్నో లోక పాపాలకు కట్టివేసి ఉండగా, ఏసుక్రీస్తు ప్రభువు ఆ కలువరి సిలువ లో మనకు బదులుగా అప్పగించబడి ఆయన కార్చిన రక్తాన్ని విమోచన క్రయధనం గా చెల్లించి మనలను విడిపించాడు.

----------------------------------------

యోహాను 10:16 - ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.

యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో చెప్పినట్లుగా పాత నిబంధనలో ఆయన ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించి మాత్రమే చెప్పాడు. కొత్తనిబంధన విషయానికి వచ్చేసరికి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మంద లో చేరడానికి అర్హులే.

ఆ విషయం ఇశ్రాయేలీయులకు అర్థమయ్యేలాగా చెబుతూ ఉన్నాడు. మందలో చేరే అవకాశం అందరికీ వుంది. కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, బయట చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి మందలో చేరుతారు అనే విషయం దేవుడు చెబుతూ ఉన్నాడు.

దేవుని స్వరము అంటే ఆయన వాక్యమే. సువార్త విని ఆయనే నిజమైన దేవుడు అని గ్రహించుకున్న వారు, తమ కాపరి స్వరాన్ని గుర్తు పట్టిన వారు ఆయన మంద లోకి చేరి వస్తారు. లోకసంబంధులు అంటే బయట వున్న వారికి, మందలో చేర్చబడనివారికి అయితే ఆయన పిలుస్తూ ఉన్నప్పటికీ, సువార్త వినిపించ బడుతున్నప్పటికీ మేము లోకంలో బలవంతులము, మాకు రక్షణ అవసరం లేదు, మందలో చేరని పొట్టేలు కొమ్ములు తిరిగి ఉండి, మేం సింహాలతో, తోడేళ్ళతో పోరాడుకుంటాం అని అంటే ఎలా వుంటుంది? గర్జించు సింహంలా ఎవరిని మ్రింగుదునా అని తిరిగే సాతాను వాళ్ళను పట్టి చీల్చి వేస్తుంది.

లోకంలో ఉన్న వారికి కాపరి లేడు.

తమ ఇష్టానుసారంగా నడుస్తూ, తింటూ, తాగుతూ కోరిన కోరికలను తీర్చుకుంటూ వున్నారు. మందలో ఉన్నవారికి ఆ అవకాశం లేదు. క్రమశిక్షణ కలిగి ఉంటేనే మందలో నివసించే అవకాశం ఉంటుంది. బయట వున్న గొఱ్ఱెలు ఎంత తిరిగినా, ఎక్కడ తిరిగినా వారికి ఒకరోజు శిక్ష వస్తుందని తెలీదు.

చివరగా ...

యెహెజ్కేలు 34:29-30 - [29] మరియు వారు ఇక దేశములో కరవు కలిగి నశించిపోకుండను అన్యజనులవలన వారి కవమానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతికొరకై తోట యొకటి నే నేర్పరచెదను. [30] అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులైయున్నారనియు వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

ఇశ్రాయేలు దేశం కంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనిమిది రెట్లు పెద్దది. అయినప్పటికీ ఇజ్రాయిల్ దేశం ప్రపంచంలో శక్తివంతమైన దేశాలలో ఒకటిగా ఉంది. ప్రపంచంలో ఉన్న ఏ దేశం కూడా దానితో శత్రుత్వం పెట్టుకోవాలని అనుకోదు. అది వాస్తవంగా ఆ దేశ ప్రజల గొప్పతనం కాదు. దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం. అంతే.

అబ్రహాము యేసు క్రీస్తు ప్రభువు కంటే సుమారు 2000 సం., లు ముందు జీవించాడు

యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి 2025 సం., దాటిపోయింది.

దాదాపు 4000 సం., గడిచిపోయినా కూడా

అన్ని వేల సం., కిందట అబ్రహాముకు, యాకోబు కు ఇచ్చిన వాగ్దానం మేరకు వారి సంతానాన్ని భూమి మీద తిరుగులేనిదిగా కాపాడుతూ వున్నాడు.

ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని మర్చిపోయి అన్య దేవతల తట్టు తిరిగితే వారిని ఎలాంటి క్రమశిక్షణలో నడిపించి తిరిగి సరైన మార్గంలో నడపాలో దేవుడు ఆ విధంగా వారిని నడిపిస్తూ ఉండవచ్చు.

అయితే దేవుడు అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదం కానీ, ఇశ్రాయేలు కు చేసిన వాగ్దానం - వారి సంతానాన్ని ఆశీర్వదిస్తాను, వారికి వాగ్దాన భూమి ఇస్తానని, అంతే. అది వారి వశం నుంచి ఇప్పటికీ తీసివేయలేదు. హిట్లర్ ఎన్నో లక్షల మంది యూదులను చంపినా, ఇప్పటికి చుట్టూ ఉన్న దేశాలు ఇశ్రాయేలు మీద యుద్ధం చేసో, ఉగ్రవాదం తోనో దొంగదెబ్బ తీయాలని అనుకున్నా వారికి ఏమాత్రం హాని కలుగలేదు.

వారికి కరువు రాదు, అన్య జనుల వలన అవమానం రాదు అని వాగ్దానం ఇచ్చాడు కదా.

ఈనాడు ప్రపంచమంతా తెలుసు ఇశ్రాయేలు దేవుడు యెహోవా అని.

కానీ క్రొత్త నిబంధనలో దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం - నిత్య జీవం.

యోహాను 10:10 ..... గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

యోహాను 10:28 - నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.

జీవం కలుగుటకును, సమృద్ధిగా జీవం కలుగుటకును, నిత్యజీవము నిచ్చుచున్నాను.

అదే విషయాన్ని దేవుడు మూడు సార్లు చెబుతున్నాడు.

మనం బైబిల్ మొదటి నుంచి ఈ భూ ప్రపంచం సృష్టించబడినప్పటి నుంచి జరిగిన సంగతులు చదివాం, విన్నాం, ఇప్పటికీ ఆ ఇశ్రాయేలు ప్రజలను చూస్తున్నాం.

అదే దేవుడే మనకు కూడా వాగ్దానం ఇచ్చాడు కదా. నిత్య జీవం ఇస్తానని. ఇశ్రాయేలు ప్రజలు ఈ లోకం లో వున్నంత వరకే వారి రాజ్యం ను కాపాడుకొని ఆయన కాపుదలలో క్షేమం గా వుంటారు. మనం నిత్య జీవం తో ఆయనతో పాటూ ఉంటాము. ఆ విషయం ఎంతైనా నమ్మదగినది. సజీవ సాక్ష్యాలు వున్నాయి నేటికీ. 

దానికి మనం చేయాల్సింది ఏమీ లేదు

లోకంలో దారి తప్పిపోయిన గొఱ్ఱెలమైన మనలను ఆయన వెదకి రక్షించాడు.

ఆయనే తన మందలో మనలను చేర్చాడు.

అనుదినము మనలను పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు.

నిత్యజీవం ఇస్తాడు.

అంతవరకు మనం ఆయన మందలో నుంచి తప్పిపోకుండా, తొలగిపోకుండా కాపరికి లోబడి జీవిస్తే చాలు.

Comments

Popular posts from this blog

నెమరు వేయుట || Chewing the cud || Rumination

రెండు డెక్కలు || Cloven Hooves || Split Hooves